![గిరిజనుల అభివృద్ధికి కాంగ్రెస్ కృషి : నాగర్కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లురవి](https://static.v6velugu.com/uploads/2025/02/congress-party-will-work-for-development-of-tribalssays-mp-dr-mallu-ravi_iwhG8PjqMN.jpg)
కొల్లాపూర్, వెలుగు: ఆదివాసి, గిరిజనుల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి అన్నారు. కొల్లాపూర్ మండలం సోమశిలలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఆదివాసి, గిరిజన కాంగ్రెస్ పార్టీ రాజకీయ శిక్షణ తరగతులు మూడు రోజులుగా నిర్వహిస్తున్నారు.
ముగింపు రోజు శుక్రవారం ఎంపీ హాజరై మాట్లాడుతూ ఆదివాసీ కాంగ్రెస్ నాయకులకు పార్టీలో ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఆదివాసీ, గిరిజనులకు 11శాతం రిజర్వేషన్ పెంచి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు. ఆదివాసీ, గిరిజన తండాలకు ప్రత్యేక నిధులు కేటాయించి తండాలు, గూడాలను అభివృద్ధి పథంలో నడపడానికి పార్టీ ప్రత్యేక ప్రోత్సహకాలను అందిస్తుందని తెలిపారు.
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో ల్యాండ్ సీలింగ్ చట్టం తీసుకొచ్చి ఆదివాసీలకు, గిరిజనులకు దళితులకు మైనార్టీ, బీసీలకు పట్టాలు అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అన్నారు. కార్యక్రమంలో సీడబ్ల్యూసీ ఏఐసీసీ సెక్రటరీ చల్లా వంశీచంద్ రెడ్డి, ఏఐసీసీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కోఆర్డినేటర్ కొప్పుల రాజు, జాతీయ ఆదివాసీ గిరిజన కాంగ్రెస్ అధ్యక్షుడు విక్రాంత్ భూరియా, అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ, రాష్ట్ర ట్రైకర్ చైర్మన్ బెల్లయ్య నాయక్, జిల్లా గిరిజన అధ్యక్షుడు లింగం నాయక్, ఆదివాసీ, గిరిజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.